చరణ్ మేకోవర్ పై రాజమౌళి ఫోకస్ – Vetagadu

బాహుబలిలో ప్రభాస్ వాడిన కత్తి దగ్గర నుంచి, కొత్త సినిమాలో రామ్ చరణ్ కి క్రాఫ్ చేస్తున్న కత్తెర వరకు ప్రచారం కోసం దేన్నీ వదిలేలా లేడు రాజమౌళి. మరీ ముఖ్యంగా మేకోవర్ విషయంలో రాజమౌళి చాలా క్లియర్ గా ఉంటాడు. బాహుబలిలో ప్రభాస్, రానాను ఎంత కొత్తగా చూపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ లో కూడా చరణ్, తారక్ ను అంతే కొత్తగా చూపించబోతున్నాడు జక్కన్న.

రామ్ చరణ్ న్యూలుక్ కోసం బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీం హకీంని మరోసారి రంగంలోకి దింపాడు రాజమౌళి. ఈ విషయాన్ని అలీం స్వయంగా ప్రకటించాడు. ‘సై’ మూవీ తర్వాత ‘బాహుబలి’కి రాజమౌళితో కలసి పనిచేశానని, ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ కి చేస్తున్నానని, రాజమౌళి దేశం గర్వించదగ్గ డైరెక్టర్ అని ట్వీటాడు హకీం.

అయితే హకీంకి రామ్ చరణ్ పరిచయం కొత్తేమీకాదు. రంగస్థలం తర్వాత బోయపాటితో చేస్తున్న సినిమా కోసం అప్పట్లోనే ఆలీం హకీంతో చరణ్ స్పెషల్ కటింగ్ కొట్టించుకున్నట్టు ఫొటోలు కూడా బైటకొచ్చాయి. అయితే వినయ విధేయ రామ ట్రైలర్ లో చరణ్ లుక్ లో మరీ అంత వేరియషన్ అయితే కనిపించలేదు. కానీ ఆర్-ఆర్-ఆర్ లో మాత్రం చరణ్ ని పూర్తిగా మేకోవర్ చేయించేస్తున్నాడు రాజమౌళి.

తెలుగు హీరోలకు బాగా పరిచయం ఉన్న హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీం. మహేశ్ బాబు, ప్రభాస్, నితిన్, కల్యాణ్ రామ్, సోనూసూద్ ఇతనికి రెగ్యులర్ కస్టమర్లు. బాలీవుడ్ లో అయితే మనోడి కత్తెరకి తిరుగేలేదు. బచ్చన్ ఫ్యామిలీ నుంచి, కపూర్ ఖాన్ దాన్ వరకు అందరూ ఈయన సెలూన్ కి క్యూ కట్టాల్సిందే. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా.. హెయిర్ స్టైల్ వెనకున్న కటింగ్ మాస్టర్ కూడా ఇతడే.